Telangana is dreaming big on Life Sciences, says KT Rama Rao


తెలంగాణ ఔషధరంగం వాయువేగంతో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు ప్రపంచ శ్రేణి సంస్థలను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చూపిస్తున్న శ్రద్ధతో గడిచిన నాలుగేండ్లలో తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌లోకి రూ.10,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించిన టీఎస్‌ఐపాస్‌తో ఇప్పటిదాకా దాదాపు 700 పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్‌అండ్‌డీకి చెందినవే 100కుపైగా ఉండటం గమనార్హం. ఈ పెట్టుబడులతో కొత్తగా 70,000 ఉద్యోగాలు అందివచ్చాయి.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. దేశంలోనేగాక ఆసియా ఖండంలోనూ లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, తయారీల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. గత నాలుగేండ్లుగా అనేక కొత్త సంస్థలను ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తుండటంతో విస్తరణ ప్రణాళికలతో ఫార్మా రంగం వర్ధిల్లుతున్నది. నోవార్టీస్, బయోలాజికల్ ఈ, లారస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా వంటి కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. మరోవైపు ప్రపంచస్థాయి సంస్థల చూపంతా కూడా ఇప్పుడు ఇక్కడే నెలకొన్నది. ఇప్పటికే ఫెర్రింగ్ ఫార్మా, కేమో, జీఎస్‌కే, సిన్జెన్, ైస్లెబ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అనేక విదేశీ దిగ్గజాలు తెలంగాణకు వచ్చాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి స్థానిక దిగ్గజాలూ రాష్ట్రంలో ఉండనే ఉన్నాయి. దీంతో ఔషధ రంగంలో తెలంగాణ వాయు వేగంతో పరుగులు పెడుతున్నది.

టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడుల వరద

నూతన పారిశ్రామిక అనుమతుల విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటిదాకా సుమారు 700 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో సుమారు 100 వరకు ఆర్‌అండ్‌డి రంగంలో ఉన్నాయంటే తెలంగాణలో ఉన్న పరిశోధన అనుకూల పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ స్నేహపూర్వక వాతావరణం వలన సుమారు 80 ప్రాజెక్టులు ఇప్పటికే తమ పనులు ప్రారంభించాయి. ఈ మొత్తం పెట్టుబడుల వలన సుమారు 20వేల హైవాల్యూ పరిశోధన ఉద్యోగాలతోపాటు 50వేల ఉద్యోగాలు ఫార్మా తయారీ రంగంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక గడిచిన నాలుగేండ్లలో రూ.10,222 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయి. ఇందులో రూ.3,000 కోట్లు కేవలం ఆర్‌అండ్‌డీలోకే రావడం జరిగింది.

తెలంగాణ ఎగుమతుల్లో 36 శాతం లైఫ్ సైన్సెస్‌వే

నూతన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఫార్మా రంగం ఎగుమతుల విషయంలోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. తెలంగాణ ఎగుమతుల్లో లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే 36 శాతంతో సింహాభాగంలో ఉన్నది. జాతీయ సగటు 1.18 శాతం మాత్రమే. గత నాలుగు సంవత్సరాల్లో ఎగుమతుల విషయంలో సుమారు 2.41 శాతం వృద్ధిని తెలంగాణ అందుకున్నది. దేశ సగటుకి రెట్టింపుతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. ఇక తెలంగాణ రాష్ట్రం శిక్షణ కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫార్మాకోపియా.. ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి యూనివర్సిటి గ్రాడ్యుయేట్లకు ఔషధ రంగ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వ్యాక్సిన్లు, బయో ఫార్మా, ఫార్మాస్యూటికల్ తయారీ వంటి ఇతర నైపుణ్యాలకు కూడా శిక్షణ అందించేందుకు సిద్ధం అవుతున్నది. మొత్తానికి గత నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోపాటు కేటీఆర్‌ల కృషి.. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నది. ముఖ్యంగా అనేక ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలను, అగ్ర నాయకత్వాన్ని కేటీఆర్ ప్రత్యక్షంగా కలువడం బాగా కలిసొచ్చింది. అమెరికా తదితర దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులకు హాజరై తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించడంలో కేటీఆర్ విజయం సాధించారు.

మా విధానాలు ఫలిస్తున్నాయ్: కేటీఆర్

లైఫ్ సైన్సెస్ పరంగా తెలంగాణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. తెలంగాణకు సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా ఇక్కడ యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకుపోవాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్న ఆయన రాష్ర్టాన్ని వృద్ధిపథంలో నడిపించే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. అన్ని రంగాలను పరుగులు పెట్టించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందులోభాగంగానే రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ 2.0, మెడికల్ డివైసెస్ పార్క్ లాంటి ప్రాజెక్టులతోపాటు తాజాగా ప్రకటించిన బీ-హాబ్, లైఫ్ సైన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇన్నోవేషన్ ఫండ్, లైఫ్ సైన్సెస్ శిక్షణ కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఫార్మా రంగం వెలిగిపోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈసారి ఫార్మా ఎగుమతులు 19 బిలియన్ డాలర్లపైనే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) దేశీయ ఔషధ రంగ ఎగుమతులు 19 బిలియన్ డాలర్ల (రూ.1,31,100 కోట్లు)కుపైగానే నమోదు కావచ్చని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) అంచనా వేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2017-18) ఎగుమతులు 17.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా లేనప్పటికీ.. కొత్త మార్కెట్లలోకి ప్రవేశాలున్నందున ఈసారి 19-20 బిలియన్ డాలర్ల మధ్య ఎగుమతులు జరుగుతాయన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నది. ఇక ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే 17.76 శాతం వృద్ధితో 4.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. నిరుడు 3.9 బిలియన్ డాలర్లేనని గుర్తుచేశారు. ఈసారి ఉత్తర అమెరికా వాటా 17.67 శాతం ఎగిసి 1.40 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.

Comments