Police Holds Up Ambulance with heart attack patient For CM

ఆమె పేరు మమత.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఆమె రాష్ట్రంలో మమతానురాగాలకు చోటు లేదని ఈ సంఘటన నిరూపిస్తోంది. చావుబ్రతుకులతో పోరాడుతున్న ఓ రోగి ఉన్న అంబులెన్స్ పంపించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు మమత కాన్వాయ్‌ వెళుతుందనే కారణంగా 20 నిముషాలపాటు అక్కడే నిలిపేశారు.. ఇటు వైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వస్తున్నారని, మీరు వెల్లడానికి వీలులేదని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్ లో వారిని అడ్డుకున్నారు.తూర్పు మిడ్నపూర్‌లోని దిఘాలో పర్యటనకు వెళ్లిన మమతాబెనర్జీ తిరిగి కోల్‌కతా వస్తున్నారు. ఆమె రోడ్డు మార్గంలో వస్తారో, హెలికాప్టర్‌లో వస్తారో తెలియని పరిస్థితి. రోడ్డు మార్గంలో మమత కాన్వాయ్‌ వస్తోందని పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేశారు.

కోల్ కతా నగరంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే నగరంలో నివాసం ఉంటున్న మెహర్జాన్ బేగం (50) అనే మహిళకు గుండెపోటు వచ్చింది. స్థానిక డాక్టర్ల సూచన మేరుకు మెరుగైన చికిత్స చేయించడానికి అంబులెన్స్ లో వేరే ఆసుపత్రికి బయలుదేరారు. మార్గం మద్యలో ఎక్స్ ప్రెస్ హైవే రహదారి వచ్చే సరికి అంబులెన్స్ ట్రాఫిక్ సిగ్నల్ లో నిలిచిపోయింది. ఇటు వైపు సీఎం కాన్వాయ్ వస్తున్నదని ట్రాఫిక్ పోలీసులు అన్ని వాహనాలు నిలిపివేశారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర ప్రాధేయపడ్డారు. అయితే సీఎం కాన్వాయ్ వస్తున్నందున తాము ఏమీ చెయ్యలేమని పోలీసులు చేతులు ఎత్తేశారు. అంబులెన్స్ సైరన్ వేస్తున్నా వారు కనికరించలేదు. ఓ పోలీసు అధికారి రోగి పల్స్ చూశాడు. సీఎం గారు వెళ్లే వరకు పేషెంట్ కు ఏమీ కాదని ఉచిత సలహాపారేశారు.
ఇక్కడ ఉంది ఓ మహిళా ముఖ్యమంత్రి (మమతా బెనెర్జీ), అనారోగ్యంతో బాధపడుతున్నది ఓ మహిళ, ఎందుకు మీరు జాలి చూపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఓ సీనియర్ పోలీసు అధికారి అక్కడకు చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకోవడంతో అంబులెన్స్ వెల్లడానికి అనుమతి ఇచ్చారు. మెహర్జాన్ బేగంను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనే తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నిలిపివేయాల్సిన అవసరం లేదని మమతా బెనర్జీ పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై హౌరా ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ అంబులెన్స్‌ను నిలిపివేసిన విషయమేదీ తన దృష్టికి రాలేదని చెప్పారు. ఒకవేళ అలా జరిగి ఉంటే అది దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళుతున్నందున అంబులెన్స్‌ను ఆపాలని తామెలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సుమిత్‌ స్పష్టం చేశారు.Comments