Visakhapatnam Godavari river accidentగోదాట్లోకి దూసుకెళ్లిన వాహనం

  • 50 అడుగుల ఎత్తు నుంచి బోల్తా
  • విషాదంగా మారిన తిరుపతి యాత్ర
  • 22 మంది దుర్మరణం
  • అంతా విశాఖకు చెందిన ఒకే కుటుంబీకులు
  • మృతుల్లో ఏడుగురు చిన్నారులు
  • ప్రాణాలతో బయటపడ్డ పదేళ్ల బాలుడు
  • మలుపులో ప్రమాదం.. డ్రైవర్‌ నిద్రే కారణం 
  • ప్రధాని, సీఎం, సోనియా, రాహుల్‌ దిగ్ర్భాంతి

తిరుమల వెళ్లారు. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ వచ్చారు. కనకదుర్గమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. వారంరోజులపాటు మరికొంతమంది దేవుళ్లను, దేవతలనూ ఆనందంగా దర్శించుకున్నారు. సింహాచలం వెళ్లి అప్పన్న దర్శనం కూడా చేసుకోవాలని భావించారు. అంతలోనే ఘోరం! పెను ప్రమాదం మూడు తరాలను బ్యారేజీ మింగేసింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మందిని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరిలోకి ఓ వాహనం పడిపోవడంతో ఈ ఘోరం జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా వాసులు 22 మంది మరణించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామ పంచాయితీ శివారు మోసయ్యపేటకు చెందిన ఈగల అప్పారావు (55) తన కుటుంబసభ్యులు, బంధువులతో కలసి తన సొంత వాహనమైన తుఫాన్‌ వాహనం(ఏపీ 31 టీసీ 3178)లో గత శనివారం తిరుపతి యాత్రకు బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి ఈ వాహనంలో 10 నుంచి 12మంది మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. అయితే ఇందులో మొత్తం 23 మంది బయలు దేరారు. వారం రోజులపాటు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని సింహాచలం అప్పన్న దర్శనం చేసుకోవాలని తిరుగుప్రయాణమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ స్కవర్‌ స్లూయిజ్‌ సమీపంలోని హ్యాండ్‌ రెయిలింగ్‌ను ఢీకొట్టిన వాహనం మారు 50 అడుగుల లోతులో ఉన్న గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పారావుతోపాటు అతని భార్య, నలుగురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు, మనవరాళ్లు, బంధువులు మొత్తం 22 మంది మృత్యువాత పడ్డారు. అప్పారావు మనవడు పదేళ్ల కిరణ్‌ మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్యలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐదున్నర గంటల సమయంలో ఒక మోటారుసైక్లిస్టు, నిత్యం వాకింగ్‌ చేసేవారు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితోపాటు ఆటో యూనియన్‌ సభ్యులు కూడా అక్కడి చేరుకుని ప్రమాదానికి గురైన వారిని రక్షించే యత్నం చేశారు. మంచినీళ్లు మంచి నీళ్లు అని కలవరిస్తున్న కిరణ్‌ను ముందుగా ఆస్పత్రికి తరలించారు. మిగిలినవారంతా వాహనంలోనే విగతజీవులై ఉండడం గుర్తించి మృతదేహాలను బయటకు తీశారు. బోల్తాపడిన వాహనాన్ని క్రేన్‌ సహాయంతో పైకి తీశారు. మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి భౌతికకాయాలను విశాఖ జిల్లాలోని వారి స్వగ్రామం మోసయ్యపేటకు తరలించారు. ఈగల అప్పారావు కుటుంబానికి చెందిన 22మంది మృతి చెందడంతో మోసయ్యపేట శోకసంద్రమైంది. మరోవైపు.. అప్పారావు చిన్న కుమారుడు గోపి భార్య మాత్రం ఈ యాత్రకు రాలేదు. 

ఎలా జరిగిందో!
ఈ ఘోర దుర్భటన ఎలా జరిగి ఉంటుందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటననుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి మాత్రమే ఘటన గురించి కొంచెం కొంచెం చెప్పగలుగుతున్నాడు. తమ వాహనం గాలిలో ఎగిరినట్టు అనిపించిందని, నాన్నకు, పెదనాన్నకు కాళ్లు విరిగిపోయాయని, అక్క దాహం, దాహం అందని మాత్రమే చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే బ్యారేజ్‌ నుంచి ధవళేశ్వరం వైపు దిగేటప్పుడు ఉన్న పెద్ద మలుపును డ్రైవర్‌ చూసుకోకపోవడం వల్లే దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఆ సమయంలో బ్యారేజ్‌పై లైట్లు కూడా లేవు. దీంతోపాటు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తులో కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్‌గ్రేషియా
ధవళేశ్వరం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఆయన ఒంగోలులో తెలిపారు. 

మోదీ, సోనియా సంతాపం
ఈ ప్రమాదం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య, కాంగ్రెస్‌ అఽధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షులు రాహుల్‌, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు రాష్ట్ర మంత్రులు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌ లోకేశ్‌, ఇతర పార్టీల నేతలు పలువురు సంతాపం ప్రకటించారు.

Comments