India won the match by 77 runsమూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడోవన్డేలో భారత్ 77 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా సిరీస్‌ను ఆరంభించిన ధోనీసేన తొలిరెండు వన్డేల్లో కంగుతిన్నా మూడోవన్డేలో స్థాయితగ్గ ఆటను ప్రదర్శించి బంగ్లాను చిత్తుచేసింది. టాస్ నెగ్గి బంగ్లా కెప్టెన్ మొర్తాజా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఓపెనర్ ధావన్(73 బంతుల్లో 75, 10×4), ధోనీ(77 బంతుల్లో 69, 6×4, 1×6) అర్ధశతకాలకు తోడు రాయుడు(49 బంతుల్లో 44, 3×4), రైనా (21 బంతుల్లో 38, 3×4, 2×6) ఇన్నింగ్స్‌లు జత కావడంతో 50 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా.. పార్ట్‌టైమ్ బౌలర్ సురేశ్ రైనా(3/45), కులకర్ణి(2/34) విజృంభించడంతో 47 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మన్లలో సబ్బీర్ రెహ్మాన్(43), సౌమ్యసర్కర్ (40), లిట్టన్‌దాస్(34), నాసిర్‌హుస్సేన్(32) పర్వలేదనిపించారు. ఆల్‌రౌండ్ షోత్ జట్టుకు విజయాన్ని అందించిన రైనాకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్, సంచలన బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు మ్యాన్ ఆఫ్‌ద సిరీస్ దక్కింది. ఈ మ్యాచ్ ఫలితంతో మూడు వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో సొంతం చేసుకుంది.
మెరిసిన బౌలర్లు :
Untitled-3సిరీస్‌లో తొలిసారి భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. భారీలక్షఛేదనకు దిగిన బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డాషింగ్ ఓపెనర్ తమిమ్ ఇక్బాల్(8)ను ధావల్ కలకర్ణి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా మరో ఓపెనర్ సౌమ్యసర్కర్, లిటన్‌దాస్‌జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడినా సర్కర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అర్ధశతకం దిశగా పయనిస్తున్న సౌమ్యసర్కర్‌ను ధావల్ కులకర్ణే పెవిలియన్‌కు చేర్చాడు. ఇక లిటన్‌దాస్ జత కలిసిన ముష్ఫీకర్ రహీం(24) కూడా దూకుడుగానే ఆడడంతో 16 ఓవర్లలో 103/2తో నిలిచిన బంగ్లా గెలుపు దిశగా పయనించేలా కనిపించింది.
అయితే పార్ట్‌టైమ్ స్పిన్నర్ రైనా.. ముష్ఫీకర్ రహీం చక్కటి బంతితో బోల్తా కొట్టించగా, ఆ మరుసటి ఓవర్‌లోనే లిట్టన్‌దాస్‌ను అక్షర్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక ఆల్‌రౌండర్ షకిబ్ కూడా రైనాకే దొరికిపోవడంతో బంగ్లా ఛేదనలో వెనకబడింది. కొద్దిసేపు నాసిర్ హోస్సేన్‌తో కలిసి ధాటిగా ఆడిన సబ్బీర్.. బిన్నీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో బంగ్లా ఓటమి ఖరారైంది. ఇక చివర్లో నాసిర్, ఆరాఫత్, ముస్తఫిజుర్ కొద్దిసేపు పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
ధావన్ జోరు : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఆరంభం నుంచే బంగ్లా బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేసిన రోహిత్(29)ను ముస్తఫిజుర్ కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికి భారత్ స్కోరు ఏడో ఓవర్లలో 39 పరుగులే. రోహిత్ తొందరగానే నిష్క్రమించినా మరో ఓపెనర్ ధావన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఫామ్‌ను కొనసాగించిన ధావన్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కోహ్లితో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లి ఆచితూచి ఆడినా ధావన్ మాత్రం వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో స్పిన్నర్ ఆరాఫత్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలు బాదిన ధావన్ 50 బంతుల్లో వరుసగా రెండో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని షకిబ్ విడదీశాడు. షకిబ్ తన తొలిఓవర్‌లోనే కోహ్లి(25)ని అవుట్ చేసి బంగ్లాకు బ్రేక్ ఇచ్చాడు. మరో ఆరు ఓవర్ల తరువాత శతకం దిశగా పయనిస్తున్న ధావన్‌ను మొర్తాజా పెవిలియన్‌కు చేర్చడంతో భారత్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 158/3తో నిలిచింది. కోహ్లి, ధావన్ రెండోవికెట్‌కు 75 పరుగులు జోడించారు.
నిలబడిన ధోనీ, రాయుడు : స్వల్ప వ్యవధిలో కోహ్లి, ధావన్ పెవిలియన్ చేరినా కెప్టెన్ ధోనీ తెలుగు కుర్రాడు అంబటి రాయుడు జట్టు భారీస్కోరుకు బాటలు పరిచారు. బంగ్లా స్పిన్ త్రయం షకిబ్, నాసిర్‌హోస్సేన్, ఆరాఫత్ సన్నీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీషాట్లు ఆడని ఈ జోడీ వికెట్ల మధ్య వేగంగా కదులుతూ సింగిల్స్, డబుల్స్‌తోనే స్కోరుబోర్డును నడిపించింది. ఈ క్రమంలో ధోనీ 58 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే నాల్గోవికెట్‌కు 93 వికెట్లు జోడించిన తరువాత రాయుడు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. ఇక రాయుడు అవుటైనా క్రీజులోకి వచ్చిన రైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వచ్చి రావడంతోనే బౌండరీతో ఖాతా తెరిచిన రైనా క్రీజులో ఉన్నంతసేపు ధాటిగానే ఆడాడు. దీంతో భారత్ అలవోకగా 300 పరుగుల మార్కు చేరింది.

Comments