ACB starts questioning TDP leader in cash-for-vote case :Mana Telangana • ఎసిబికి ఎలెక్షన్ కమిషన్ అండ, దర్యాప్తు సాగించాలని లేఖ
 • నిష్పక్షపాతంగా విచారణ జరగాలి
 • దోషులు ఎంతటివారైనా జంకవద్దు
 • అవినీతి నిరోధక శాఖకు భన్వర్‌లాల్ లేఖ
 • ఆరు గంటల పాటు సాగిన వేం నరేందర్ రెడ్డి విచారణ
 • హృద్రోగ కారణంతో ఆగిన అరెస్టు
 • నోటీసుకు దొరకని సండ్ర
 • 19 లోగా హాజరు కాకపోతే అరెస్టు
 • స్టీఫెన్‌సన్ వాంగ్మూలం రికార్డు,
 • దీని ఆధారంగా మరికొంతమందికి నోటీసులు, అరెస్టులకు అవకాశం
 • మళ్లీ గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ముఖ్యమంత్రి పోలీసు పెద్దలతో భేటీసంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంగ్లో ఇండియన్ ఎం.ఎల్. ఎ స్టీఫెన్ సన్‌కు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు సెబాస్టియన్, ఉదయ సింహలు 50 లక్షల రూపాయ లు లంచం ఇస్తూ పట్టుబడిన వైనంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్ లాల్ తెలంగాణ ఎసిబిని ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో మంగళవారం నాడు తాఖీదులు అందుకున్న తెలుగుదేశం ఎం.ఎల్.సి అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి బుధవారం ఎసిబి అధికారు ల ఎదుట హాజరై ఆరు గంటల పాటు విచారణలో పాల్గొన్నారు. తెలుగుదేశం ఎం.ఎల్.ఎ సండ్ర వెంకట వీరయ్యకు మంగళ వారం నోటీసులు ఇచ్చేందుకు వెళ్లి ఆయన లేక పోవడంతో వెను దిరిగిన ఎసిబి అధికారులు బుధవారం ఉదయం హైదర్‌గూడ లోని ఎం.ఎల్.ఎ క్వార్టర్స్‌కు వెళ్లి ఆయనుండే ఇంటికి తాఖీదులు అంటించి, ఈ నెల 19వ తేదీలోగా విచారణకు రావాలని ఆదేశించారు. ఈలోపు ఆయన విచారణకు రాకుంటే అరెస్టు చేయాలని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు దారుడైన స్టీఫెన్‌సన్ నాంపల్లి కోర్టులో తన కూతురు, ఆమె మిత్రుడితో కలిసి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూ లం ఇచ్చారు. ఈ ఘటనలు ఓవైపు జరుగుతుండగా సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అనంతరం టి.డిజిపి అనురాగ్ శర్మ, ఎసిబి చీఫ్ ఎ.కె ఖాన్, సిటీ కొత్వాల్ మహేందర్ రెడ్డిలు సిఎం కెసిఆర్‌తో భేటీ అయి నోటుకు ఓటు కేసు దరిమిలా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఓటుకు నోటు కేసులో ఎసిబి విచారణకు మరింత బలం చేకూరింది. ఈ కేసులో తెలంగాణ ఎసిబి విచారణ ఎన్నికల సంఘం నిబంధన లకు విరుద్దమని తెలుగు దేశం నాయకులు పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం దీనిపై అన్ని కోణాల్లో నిగ్గు తేల్చాల్సిం దేనని తేల్చి చెప్పింది. ఓ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే ముడుపులు అందించిన వైనం సాధారణమైన అంశం కాదని, ఇందులో ఉన్న పెద్ద తలకాలయల విషయం బయటకు తేవాలని ఎన్నికల సంఘం తెలంగాణ ఎసిబిని ఆదేశించింది. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జర గాలని, దోషులు ఎంతటి వారైనా వదలకూడదని ఎన్ని కల సంఘం నుంచి తెలంగాణ ఎసిబికి లేఖ అందింది. మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలని ఎన్నికల సం ఘం కమిషనర్ భన్వర్‌లాల్ నుంచి తమకు ఆదేశాలు అందాయని ఎసిబి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎసిబికి ఇచ్చిన మాట ప్రకారం వేం నరేందర్‌రెడ్డి బుధ వారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ లోని ఎసిబి కార్యాలయానికి వచ్చారు . అక్కడ ఆయనను ఎస్‌పి స్థాయి అధికారి నేతృత్వంలోని ఓ బృందం సా యంత్రం ఐదు గంటల వరకు అనేక కోణాల్లో విచారిం చింది. రేవంత్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపైనా, ఎన్నికలు ముగిసిన తరువాత ఇస్తానన్న నాలుగున్నర కో ట్ల రూపాయలు ఎక్కడున్నాయనే దానిపైనే ఎక్కువగా విచారణ సాగినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు రేవంత్ బృందం అనుకున్నట్లుగా సాగివుంటే మీరు విజయం సాధించి వుండే వారు కదా..? అలాంటప్పుడు, డబ్బుల గురించి మీకు తెలిసే వుండాలి, దీనిపై సమాధానం ఇవ్వాలని ఎసిబి అధికారులు నరేందర్ రెడ్డిని అడిగినట్లు సమాచారం. ఈ గూడుపుఠాని వెనుక చంద్రబాబు పాత్ర ఏ మేరకు ఉంది..? స్టీఫెన్‌సన్‌తో పాటు ఇంకా ఎందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకుంటున్నారు? చెప్పాలని నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు అడిగినట్లు సమాచారం. కాగా ఎసిబి అధికారులు అడిగిన ప్రశ్నలకు నరేందర్‌రెడ్డి ఆచితూచి సమాధానం ఇచ్చినట్లు తెలి సింది. రేవంత్ బృందం తీసుకువచ్చిన రూ.50 లక్షల గురించి తనకు ఏమీ తెలియదని, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన బదులి చ్చినట్లు సమాచారం. కాగా విచారణ సమయంలో ఒక దశలో నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు అరెస్టు చేస్తా రని వార్తలు వచ్చాయి. అయితే తాను హృద్రోగంతో బాధ పడుతున్నందున, అరెస్టు చేయవద్దని, విచారణకు ఎప్పు డు రమ్మంటే అప్పుడు వస్తానని, వేడుకోవడంతో దీనిపై ఎసిబి అధికారులు వెనక్కు తగ్గారని సమాచారం. విచారణ అనంతరం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడు తూ ఎసిబి అధికారులు తనను అనేక కోణాల్లో ప్రశ్నిం చారని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు తెలంగాణ సర్కారు కుట్ర పన్నుతున్నదని, తనకు ఇందు లో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఎసిబి అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు స్వయంగా నోటీసు అందించడానికి ఎసిబి అధికారులు బుధవారం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇల్లు తాళం వేసి వుండడంతో చేసేది లేక ఆయన ఇంటికి నోటీసులు అతికించి వచ్చారు. తనకు నోటీసులు అంద లేదని ఓవైపు వీరయ్య మీడియా ప్రతినిధులకు ఫోన్లో చెబుతుండగా ఎసిబి అధికారులు ఆయన కోసం వెతుకు తుండడం గమనార్హం. తమ నోటీసులకు వీరయ్య స్పం దించకుంటే జూన్ 19వ తేదీ తరువాత ఆయన్ను సిఆర్ పిసి 41 సెక్షన్ కింద అరెస్టు చేసేందుకు ఎసిబి సన్నద్దమవుతోంది.

నాంపల్లి కోర్టులో స్టీఫెన్‌సన్ తదితరుల వాంగ్మూలం

ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తన కూతురు జెస్సికా, ఆమె మిత్రుడు టేలర్ తో కలిసి బుధవారం ఉదయం నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి, కోర్టు సహాయ కుల సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భగా నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు దాదాపు మూడు గంటల పాటు న్యాయమూ ర్తికి వాంగ్మూలం ఇచ్చారు. మే 31వ తేదీన, అంతకు ముందు కొద్ది రోజుల పాటు జరిగిన ఘటనలపై స్టీఫెన్ సన్ కుమార్తె జెస్సికా, మిత్రుడు టేలర్‌లు తమకు తెలిసిన విషయాలను వెల్లడించారు. కాగా వాంగ్మూలం ఇచ్చిన తరువాత స్టీఫెన్‌సన్ తనను కలిసిన వారితో పొడిపొడిగా మాట్లాడారు. తనకు తెలిసిన అన్ని విషయాలు కోర్టుకు చెప్పానని వివరించారు. తనను కొనుగోలు చేసేందుకు టిడిపి యత్నించిందని, చంద్రబాబు నాయుడు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడరని ఆయన తెలిపారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలం తరువాత ఈ కేసులో మరి కొందరికి ఎసిబి తాఖీదులు జారీ చేసే వీలుందని సమాచారం. ఇదే సమయం లో కొందరిని అరెస్టు చేసే అవకాశం వుందని కూడా తెలుస్తోంది.

గవర్నర్‌తో సిఎం భేటీ.. కెసిఆర్‌తో డిజిపి తదితరుల సమావేశం

తెలంగాణ సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ఇరువురు 20 నిమిషాల పాటు అనేక అంశాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకు జరిగి న పరిణామాలను సిఎం, గవర్నర్‌కు వివరించారని సమాచారం. హైదరాబాద్‌లో ఎపి పోలీసుల మోహరిం పుపైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గవర్నర్ తో భేటీ ముందు సిఎం కెసిఆర్‌తో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, ఎసిబి చీఫ్ ఎ.కె.ఖాన్, సిటీ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఎ.కెఖాన్ సిఎంతో మధ్యాహ్నం కూడా భేటీ అయ్యారు.

Comments